నాగసూరి వేణుగోపాల్

విజ్ఞానం, పత్రికారంగం, ప్రసార మాధ్యమం, సాహిత్యం, చరిత్ర, పర్యావరణం, గాంధేయ ఆలోచనలు వంటి విభిన్న రంగాలను కలుపుకుంటూ సాగిన బహుముఖ రచనా ప్రయాణం.

డా. నాగసూరి వేణుగోపాల్ రచనా ప్రయాణానికి ఐదు దశాబ్దాల చరిత్ర ఉంది. 1978 ఫిబ్రవరి 10న పదో తరగతి చదువుతున్న సమయంలో ఆయన రాసిన ఒక చిన్న కవిత ఆంధ్రపత్రికలో ప్రచురితమైంది. పత్రికల్లో రచనలు ప్రచురితమవడం చదువుకు ఆటంకం కలిగిస్తుందనే పెద్దల అభిప్రాయం కారణంగా “వి. జి. నాగసూరి” అనే కలం పేరును ఉపయోగించారు.

1986 మార్చి 9న ఆంధ్రప్రభ దినపత్రిక బెంగళూరు ఎడిషన్‌లో “వేమన వాదనలో కవిత” అనే వ్యాసం ప్రచురితమైంది. వేమన కవి కాదనే అభిప్రాయాన్ని చదివిన తర్వాత కలిగిన తీవ్ర స్పందన ఈ వ్యాసానికి ప్రేరణగా నిలిచింది. వేమన పద్య రత్నాకరాన్ని తీసుకుని రాత్రంతా పద్యాలను పరిశీలించి, సాహిత్యం, కవి, కవి బాధ్యత, తత్వం, సంఘసంస్కరణ వంటి అంశాలకు సంబంధించిన పద్యాలను ఎంపిక చేసుకుని తన విశ్లేషణను రూపొందించారు. అదే ఆయన తొలి ప్రచురిత వ్యాసం.

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్సీ. ఫిజిక్స్ పూర్తి చేసిన అనంతరం, ఎం.ఫిల్. ప్రవేశం కోసం ఎదురుచూస్తున్న సమయంలో హిందూపురంలోని ఎస్.డి.జి.ఎస్. కాలేజీలో పార్ట్‌టైమ్ ఫిజిక్స్ లెక్చరర్‌గా పనిచేశారు. 1986 మేలో డా. వి. సుందర రాజ పర్యవేక్షణలో సోలార్ ఎనర్జీ ఫిజిక్స్ విభాగంలో పరిశోధన ప్రారంభించి, 1987 నవంబర్ మొదటి వారంలో పరిశోధనా వ్యాసాన్ని విశ్వవిద్యాలయానికి సమర్పించారు.

1987లో పత్రికారంగం, విజ్ఞాన రచనల వైపు కూడా ఆయన ప్రయాణం విస్తరించింది. “తెలుగు పత్రికల సంపాదకీయాలు” అనే వ్యాసం 25 అక్టోబర్ 1987న ఆంధ్రపత్రిక డైలీ ఎడిట్ పేజీలో ప్రచురితమైంది. “సోలార్ వాటర్ హీటర్” అనే వ్యాసం 8 డిసెంబర్ 1987న ఆంధ్రజ్యోతి డైలీ ఎడిట్ పేజీలో “విజ్ఞాన వీచిక” శీర్షికన వెలువడింది.

1988లో ఆకాశవాణిలో చేరిన నాగసూరి వేణుగోపాల్ 33 సంవత్సరాల పాటు గోవా, ఢిల్లీ, అనంతపురం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కడప, మద్రాసు తదితర కేంద్రాల్లో పనిచేశారు. సేవలో ఉన్న సమయంలోనే జర్నలిజంలో ఎం.ఏ. పూర్తి చేసి, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి తెలుగు న్యూస్ ఛానళ్లకు సంబంధించిన అంశంపై పిహెచ్.డి. పొందారు.

1998 నుంచి ఆయన ప్రచురించిన పుస్తకాల సంఖ్య 80 దాటింది. వీటిలో 50కి పైగా స్వీయ రచనలు కాగా, 25కి పైగా పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. పాపులర్ సైన్స్, పర్యావరణం, రేడియో, పత్రికారంగం, టెలివిజన్, చరిత్ర, సాహిత్యం, గాంధీజీ వంటి విభిన్న అంశాలపై ఆయన వందలాది వ్యాసాలు, కాలమ్స్ రాశారు.

ఆయన రచనలు బి.ఎడ్., ఎం.ఏ. స్థాయిలలో పాఠ్యపుస్తకాలుగా చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 8వ తరగతి ఫిజికల్ సైన్సెస్ పాఠ్యపుస్తకానికి సంపాదకత్వం వహించారు. తెలుగు విశ్వవిద్యాలయం, ద్రావిడ విశ్వవిద్యాలయం, సాహిత్య అకాడమీ, నేషనల్ బుక్ ట్రస్ట్ తదితర సంస్థలకు కూడా రచనలు చేశారు.

పదవీ విరమణ అనంతరం గాంధీజీ ఆలోచనలు, ఆచరణల్లో నేటి సమాజానికి అవసరమైన పార్శ్వాలపై పరిశోధన కొనసాగిస్తున్నారు. ఈ అంశంపై ఎంతో మందితో రచనలు చేయిస్తూ ఇప్పటివరకు దాదాపు తొమ్మిది పుస్తకాలను వెలువరించారు. ఇతర అంశాలపై కూడా ఆయన వ్యాసాలు, పుస్తకాలు నిరంతరం వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో నివసిస్తున్నారు.
వేమన కవి కాకపోతే, ఇంకెవరు కవి కావాలి?